నర్సంపేట గల్లీ గల్లీలో అభివృద్ధి కనిపించడం లేదా?
బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
భారీ ర్యాలీతో ముగిసిన మునిసిపల్ ఎన్నికల ప్రచారం
నర్సంపేట, ఫిబ్రవరి10 అక్షర సవాల్: నర్సంపేట పట్టణంలోని ప్రతి గల్లీలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులకు కనిపించడం లేదా అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు వరంగల్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ కార్యకర్తలు,నాయకులతో కలిసి భారీ రోడ్‌షో,ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట పట్టణ అభివృద్ధికి సుమారు140 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని,దాదాపు అన్ని వార్డుల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా,తాను ఎమ్మెల్యేగా,బలరాం నాయక్ ఎంపీగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను 30కి 30 స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,పదేళ్ల పాలనలో నర్సంపేట నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలోని విలీన గ్రామాలతో కలిపి 1,100 ఇండ్లను మంజూరు చేశామని చెప్పారు అలాగే గతంలో రేషన్ కార్డుల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని,ఇప్పుడు కొత్తగా 1,500 రేషన్ కార్డులు మంజూరు చేశామని,ఉగాది తర్వాత నూతన పెన్షన్లు అందిస్తామని పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా నర్సంపేట-వరంగల్ నాలుగు లైన్ల రహదారి,నర్సంపేట-నెక్కొండ 10 మీటర్ల రహదారి,అలాగే నర్సంపేట-గూడూరు,నర్సంపేట-కేసముద్రం రహదారులు మంజూరు చేసినట్లు తెలిపారు. మెడికల్ కాలేజ్ విషయంపై మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఆసుపత్రి భవనం మాత్రమే నిర్మించి అసంపూర్తిగా వదిలేసిందని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేసి ప్రారంభించామని చెప్పారు.మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని,త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




