ల్యాదెళ్ల రాజు మృతి కేసులో మిస్టరీపై ఉత్కంఠ
ఫోరెన్సిక్ నివేదికపై ఆధారపడి దర్యాప్తు కొనసాగింపు
పోలీస్ హామీతో కుటుంబం ధర్నా విరమణ
గీసుగొండ, మార్చి 24 అక్షర సవాల్:
గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెళ్ల రాజు అనుమానాస్పద మృతి కేసు మరోసారి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేసులో నిజానిజాలను వెలికితీయడానికి పోలీసులు శాస్త్రీయ దర్యాప్తును వేగవంతం చేస్తుండగా, ఫోరెన్సిక్ నివేదికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఆ నివేదిక ఆధారంగానే కేసులోని మిస్టరీ వీడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సుమారు ఐదు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనను తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ, కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు కేసును లోతుగా పరిశీలిస్తున్నారు. గాయాలు, పోస్టుమార్టం నివేదికల మధ్య ఉన్న వ్యత్యాసాలపై స్పష్టత కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికను కోరినట్లు సమాచారం. ఆ నివేదిక అందిన తర్వాతే తదుపరి కీలక చర్యలు తీసుకునే అవకాశముంది. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులు గీసుగొండ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని న్యాయం కోరుతూ ధర్నా నిర్వహించారు. ల్యాదెళ్ల రాజు కుమార్తె, భార్య ప్రియాంక ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు పాల్గొని, కేసులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్నా సమాచారం అందుకున్న మామునూరు ఏసీపీ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సమక్షంలో కేసు పురోగతిపై సమీక్ష నిర్వహించి, పక్షపాతం లేకుండా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. సీఐ విశ్వేశ్వర్ కూడా పక్కా ఆధారాలతోనే నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల హామీతో కుటుంబ సభ్యులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. కేసులో కీలక ఆధారాలు ఉన్నప్పటికీ విచారణలో ఆలస్యం జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయాల నమోదు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా వివరాలు వెల్లడించకపోవడం, ఎఫ్ఎస్ఎల్ నివేదికలో జాప్యం వంటి అంశాలపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఆ నివేదిక ఆధారంగానే కేసు దిశ, తదుపరి చర్యలు నిర్ణయించనున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

