Trending Now
Wednesday, March 25, 2026

Buy now

Trending Now

క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

ఆత్మకూర్, అక్షర సవాల్: హనుమకొండ జిల్లాను క్షయ (టీబీ) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్ల పంపిణీతో పాటు స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ హై రిస్క్ గ్రామాల్లో వంద శాతం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. టీబీ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, ఉద్యోగులు, ప్రజలు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. టీబీ బాధితులకు న్యూట్రిషన్ కిట్లు అందించడం అభినందనీయమని తెలిపారు. వచ్చే ఏడాది ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నాటికి హనుమకొండ జిల్లాను టీబీ ముక్త్ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. సరైన చికిత్స, పౌష్టికాహారం తీసుకుంటే టీబీ పూర్తిగా నయం అవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ టీబీ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చికిత్స సమయంలో సమతుల్య పోషకాహారం తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ దశలో భాగంగా 100 రోజుల క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 2,492 హై రిస్క్ గ్రామాల్లో హనుమకొండ జిల్లాలో 25 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఈ గ్రామాల్లో 14 సంవత్సరాలు పైబడిన వారందరికీ స్క్రీనింగ్, ఎక్స్-రే, సీబీ-నాట్ పరీక్షలు 100 రోజుల్లో పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. 2025లో జిల్లాలో 1,614 టీబీ కేసులు గుర్తించి చికిత్స అందించామని, 1,416 మంది కోలుకున్నారని తెలిపారు. నిక్షయ్ పోషన్ యోజన ద్వారా 252 మందికి నెలకు రూ.1,000 చొప్పున ఆరు నెలల పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ టీబీ లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 630 మంది టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను ఆదిత్య హాస్పిటల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, చక్రవర్తి హాస్పిటల్, ప్రతిమ రిలీఫ్, ప్రశాంతి హాస్పిటల్, శ్రీ చక్ర ఆస్పత్రుల ప్రతినిధులు అందించారు. ఈ సేవలను అందించిన వారిని జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలతో సత్కరించి ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే టీబీ చాంపియన్లు, నియంత్రణలో కృషి చేసిన సిబ్బందికి కూడా సత్కారం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో ఆరు విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు సేవలు అందించారు. ఈ శిబిరంలో 269 జనరల్ ఓపీ కేసులు నమోదయ్యాయి. అవసరమైన వారికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, వైద్య అధికారులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రుబీనా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్పందన, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles