సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదేలే
రోడ్డుపైకి చేరిన పాఠశాల సమస్యలు
భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు డిమాండ్
ములుగు/మంగపేట, ఏప్రిల్ 13, అక్షర సవాల్: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రాణభయంతో గడుపుతున్నామని, వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రెగ్యులర్ టీచర్లను నియమించాలని కోరుతూ స్కూల్ బ్యాగులతో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు


