కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు…!
కవిత భావోద్వేగ ప్రసంగం
తప్పులు దిద్దుకోవడానికి ఇచ్చిన అవకాశం
పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా
తెలంగాణ రాష్ట్ర సేన కవిత
మునీరాబాద్ ప్రతినిధి, అక్షర సవాల్: తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) పార్టీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత భావోద్వేగంగా ప్రసంగించారు.ముందుగా తెలంగాణ ప్రజలు, మేధావులు, బుద్ధి జీవులు, తెలంగాణ అభివృద్ధి కోరుకునే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.నా జీవితంలో ఇదొక మరుపురాని రోజు అంటూ ప్రసంగం ప్రారంభించారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మనం కలలు కన్న తెలంగాణ రాలేదు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది అని విమర్శించారు.
సిగ్గుపడుతున్నా-సంచలన వ్యాఖ్యలు:
ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులు అయ్యాయి. ఫోన్ మాట్లాడాలంటే భయం. దారుణమైన నిఘా నీడలో మనం బతికాం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా అని కవిత అన్నారు.తెలంగాణ సాధించటంలో భాగమైనందుకు నా జన్మ ధన్యమైంది కానీ నా తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదు. ఆ తప్పులను దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలి. అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్ర సేనగా వస్తున్నాం అని స్పష్టం చేశారు.
జాగృతి పోరాటాన్ని గుర్తు చేస్తూ:
గత 20 ఏళ్లుగా తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర మీకు తెలుసు ఆడబిడ్డలందరినీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా ఊరురా బతుకమ్మ కార్యక్రమం ద్వారా చేశాం. జాగృతి ఆడబిడ్డల చేతిలో కాగడ అయ్యింది. తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాది వేసింది మా జాగృతి ఆడబిడ్డలు అని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ కోల్పోయింది:
పోరాటాలకు రాజకీయ శక్తి, అధికారం ఉంటే ఇంకా బాగా పనిచేయవచ్చు. రాజకీయ పార్టీకి రాజకీయ ఆత్మ ఉండాలి. అజెండా ఉండాలి. బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మ కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది అని వివరించారు.
అమ్మలా పాలించాలనుకుంటున్నా:
తెలంగాణలోని మూడు కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నా. అమ్మతనంతో, ఆర్ధితో పాలన జరిగినప్పుడే కష్టాలు తీరుతాయి అని అన్నారు.చాకలి ఐలమ్మ, గద్దరన్న, మారోజు వీరన్న, కొమురం భీం, కొండ లక్ష్మణ్ బాపూజీ, పాపన్న గౌడ్, సమ్మక్క సారక్క స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని కవిత ప్రకటించారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు, జాగృతి నాయకులు, మహిళలు తరలివచ్చారు.


