మా భూములు తీసుకుని మా ఊరి గుర్తింపునే చెరిపేస్తారా?
కాకతీయ టెక్స్టైల్ పార్క్లో ‘విగ్రహ రాజకీయాల’పై బీజేపీ అగ్గి
సీఎం రేవంత్, ఎమ్మెల్యే రేవూరిపై ఘాటు దాడి
ఓరుగల్లు, మే 25 అక్షర సవాల్: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. శాయంపేట గ్రామ రైతుల త్యాగాలతో నిర్మితమవుతున్న ఈ భారీ ప్రాజెక్టు ఇప్పుడు “విగ్రహ రాజకీయాల”కు వేదికవుతోందంటూ భారతీయ జనతా పార్టీ గీసుకొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా భూములు తీసుకుని… ఇప్పుడు మా ఊరి అస్తిత్వాన్నే చెరిపేస్తారా?” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం శాయంపేట గ్రామ రైతులు తమ పంట భూములు, జీవనాధారాన్ని త్యాగం చేశారని, అలాంటి గ్రామ ప్రజల భావోద్వేగాలను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబ విగ్రహాలను ప్రతిష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. “ఈ పార్క్లో మా రైతుల చెమట ఉంది… కానీ ఇప్పుడు మా ఊరి పేరు కూడా వినిపించకుండా చేసే కుట్ర జరుగుతోంది” అని ఆరోపించారు. “దేశంలో ఎక్కడ చూసినా ఒకే కుటుంబ రాజకీయాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ గడ్డపై కూడా అదే రాజకీయాలను రుద్దాలని చూస్తే ప్రజలు సహించరు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ గర్వకారణమైన కాకతీయుల చరిత్రను మరుగునపెట్టి ఢిల్లీ రాజకీయాలను తీసుకురావడం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానించడమేనన్నారు. కాకతీయుల శౌర్యాన్ని ప్రపంచానికి చాటిన రాణి రుద్రమా దేవి, గణపతిదేవుడు, ప్రతాపరుద్రుడు వంటి మహనీయుల వారసత్వాన్ని విస్మరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. “కాకతీయుల చరిత్ర ఉన్న గడ్డపై ఢిల్లీ రాజకీయాల ముద్ర వేయాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు” అని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డి శాయంపేట గ్రామ ప్రజల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని, ఢిల్లీ అధిష్టానం కంటే స్థానిక రైతుల గౌరవమే ముఖ్యమని స్పష్టం చేశారు. “ప్రజా ప్రభుత్వం” అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పీఎం మిత్ర పథకం కింద వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్న కాకతీయ టెక్స్టైల్ పార్క్లో స్థానిక చరిత్రను, శాయంపేట గ్రామ గుర్తింపును కాపాడాలని కోరారు. గాంధీ కుటుంబ విగ్రహాల బదులుగా కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా రాణి రుద్రమదేవి, గణపతిదేవుడి విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. “రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే… ఇక్కడ కాకతీయుల శౌర్యాన్ని చాటే విగ్రహాలే నిలుస్తాయి” అంటూ కొంగర రవికుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. శాయంపేట గ్రామ అస్తిత్వం, రైతుల గౌరవం కాపాడే వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే భారీ ప్రజా ఉద్యమం తప్పదని బీజేపీ హెచ్చరించింది.


