Trending Now
Sunday, March 8, 2026

Buy now

Trending Now

కొమ్మాల జాతరలో బెల్ట్ షాపుల దందా

కొమ్మాల జాతరలో బెల్ట్ షాపుల దందా

దేవాలయం పక్కనే మద్యం అమ్మకాలు – ఎవరి అనుమతి?

తప్ప తాగి మందుబాబుల హల్చల్

జాతరలో ఇబ్బంది పడుతున్న భక్తులు

గీసుగొండ, అక్షర సవాల్:

ప్రసిద్ధ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర లో దేవస్థానం పరిసరాల్లో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం దందా సంచలనం సృష్టిస్తున్నాయి. జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తున్న వేళ దేవాలయం సమీపంలోనే మద్యం అమ్మకాలు జరుగుతుండటం భక్తుల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం జాతర సమయంలో కొందరు వ్యక్తులు తాత్కాలికంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పవిత్రమైన దేవాలయం పరిసరాల్లో ఈ అక్రమ వ్యవహారం జరుగుతుండటంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మద్యం నిషేధ మరియు ఎక్సైజ్ చట్టం–1968 ప్రకారం లైసెన్స్ లేకుండా మద్యం విక్రయించడం నేరం. ముఖ్యంగా దేవాలయాలు, పాఠశాలలు వంటి ప్రజా ప్రదేశాల సమీపంలో అనధికారంగా మద్యం విక్రయిస్తే సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ జాతర సమయంలో కొన్ని చోట్ల బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్న సమాచారం అధికారుల దృష్టికి చేరిందా? లేదా అధికారుల కను సన్నల్లోనే ఈ బెల్ట్ షాపుల దందా నడుస్తుందా అనేది పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జాతర పవిత్రకు అపవిత్ర తోడైంది

లక్ష్మీనరసింహస్వామి జాతర అంటే ఎంతో పవిత్రతతో కూడినటువంటి ఎలాంటి మాంసాహారము మద్యపానము లేకుండా జరగాల్సిన జాతర… గుడి చుట్టూ బెల్టు షాపులు ఏర్పాటు చేసి… దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు.. పట్టపగలే మద్యపానం సేవిస్తూ.. జాతరకు వచ్చే మహిళలను .. భక్తులను మందుబాబులు జాతరలో హల్చల్ చేస్తున్నారు.. బెల్ట్ షాపుల్లో ఒక్కో క్వార్టర్ పై ఎమ్మార్పీ రేటు అదనంగా 70 రూపాయలు, ఫుల్ బాటిల్ అయితే సుమారు 250 రూపాయలు, ఒక్కో బీరు బాటిల్ పై వంద రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు..

దందాలో ఎవరి వాటా ఎంత..?

ఈ దందాలోఎవరి వాటా ఎంతని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఎక్సైజ్, పోలీసులు ఏం చేస్తున్నారు అనధికారికంగా విక్రయించేందుకు పర్మిషన్ ఎవరిచ్చారని భక్తులు ప్రశ్నిస్తున్నారు..

అక్రమ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ సీఐ వివరణ

అక్రమ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ సీఐ తాతాజీ ని సంప్రదించగా, జాతర ప్రాంతంలో ఒకే వైన్స్ షాపుకు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు.అది కూడా జాతర ప్రారంభమైన మూడు రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఆయన తెలిపారు. దేవస్థానం పరిసరాల్లో బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం గురించి అడగగా, “ఆ విషయాన్ని రేపు పరిశీలిస్తాను” అని సీఐ పేర్కొన్నారు. దేవస్థానం పరిసరాల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఎవరు ఇచ్చారు? ఎక్సైజ్ శాఖకు ఈ విషయం తెలుసా? లేక అధికారుల కళ్లముందే అక్రమ వ్యాపారం జరుగుతుందా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు వెంటనే స్పందించి బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దేవాలయ పవిత్రతను కాపాడేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Related Articles

Latest Articles