అక్షర సవాల్ కథనానికి స్పందన – కదిలిన విద్యుత్ శాఖ
నెక్కొండ, అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామంలో “ఇంటి గోడలను తాకుతున్న విద్యుత్ తీగలు – అధికారుల నిర్లక్ష్యంతో పొంచివున్న ప్రమాదం” అనే అక్షర సవాల్ కథనం వెలువడిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఎల్తూరి యాకయ్య ఇంటి సమీపంలో వంగిపోయిన విద్యుత్ స్తంభాన్ని ఆదివారం సరిచేయడంతో పాటు అదనంగా కొత్త స్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక యంత్రాల సహాయంతో స్తంభాన్ని నిలువుగా అమర్చి,ఇంటికి అత్యంత ప్రమాదకరంగా దగ్గరగా ఉన్న విద్యుత్ తీగలను సురక్షిత దూరానికి మార్చారు. ఈ చర్యలతో గత కొన్ని రోజులుగాఆందోళనలో ఉన్న బాధిత కుటుంబం, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం పూర్తిగా తొలగిపోవడంతో గ్రామంలో భద్రతా వాతావరణం నెలకొంది. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ‘అక్షర సవాల్’ దినపత్రికకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఇలాగే అధికారులు తక్షణ స్పందన చూపాలని గ్రామస్తులు కోరారు.

