కొమ్మాల గుట్ట జాతర హుండీ లెక్కింపు
ఆదాయం రూ.21.22 లక్షలు
గీసుగొండ, మార్చి 11 అక్షర సవాల్:
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా దేవస్థాన హుండీల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. భక్తులు సమర్పించిన నగదు, కానుకలను అధికారులు క్రమబద్ధంగా లెక్కిస్తున్నారు. జాతర ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ.21,22,410 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థాన ఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో హుండీల లెక్కింపును ఉత్సవ కమిటీ చైర్మన్ విరాట్ రవీందర్ రెడ్డి ప్రారంభించారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన నగదు, కానుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద లెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో ప్రసాద్ మాట్లాడుతూ భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని హుండీల లెక్కింపును పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చి స్వామివారికి కానుకలు సమర్పించారని చెప్పారు. ఉత్సవ కమిటీ చైర్మన్ విరాట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని దేవస్థానం అభివృద్ధి పనులకు వినియోగిస్తామని తెలిపారు. జాతర ఆదాయం వివరాల ప్రకారం శీఘ్ర దర్శనం ద్వారా రూ.2,29,000, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,61,200, కేశఖండనం ద్వారా రూ.72,500, అష్టోత్తరం ద్వారా రూ.1,20,000 ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో కొమ్మాల గ్రామ సర్పంచ్ యమున ప్రవీణ్ యాదవ్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ డి. అనిల్ కుమార్, దేవస్థాన ఉత్సవ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమం కొనసాగింది.


