పూణే జాతీయ ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి పీడీ స్వప్న ఎంపిక
గీసుకొండ ముద్దుబిడ్డ ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
పాఠశాలలో ఘన సన్మానం
చెన్నారావుపేట, అక్షర సవాల్: గీసుకొండ గ్రామానికి చెందిన ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్ అసిస్టెంట్) వీరగోని స్వప్న జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికై ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ నెల 17 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్ లెవల్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్‌లో ఆమె పాల్గొననున్నారు. క్రీడల పట్ల ఉన్న అంకితభావం, నిరంతర సాధనతో స్వప్న ఈ స్థాయికి చేరుకోవడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తున్నారు. సివిల్ సర్వీసెస్ విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఆమె ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాల ఆవరణలో స్వప్నను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు చెన్నారావుపేట మండల విద్యాధికారి (ఎంఈఓ) పాపమ్మ, ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తేజావత్ జయ శాలువా కప్పి, పూలమాలలతో ఆమెను సత్కరించారు ఈ సందర్భంగా ఎంఈఓ పాపమ్మ మాట్లాడుతూ స్వప్న జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక కావడం మండలానికి,జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు జయ మాట్లాడుతూ క్రీడల్లో స్వప్న చూపిస్తున్న ప్రతిభ విద్యార్థులకు స్ఫూర్తినిస్తోందని, పూణేలో జరిగే పోటీల్లో విజయం సాధించి పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొని స్వప్నకు అభినందనలు తెలిపారు.

