జాతరలో అక్రమ పార్కింగ్ వసూళ్లు
11 మందిపై కేసు నమోదు
గీసుగొండ, మార్చి19 అక్షర సవాల్: కొమ్మాల గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా సైకిల్ స్టాండ్ (పార్కింగ్) పేరిట అక్రమ వసూళ్లు జరిపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి రేమల్లి శంకర్ రావు ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… జాతర సందర్భంగా సైకిల్ స్టాండ్ నిర్వహణకు టెండర్ దేవులపల్లి అశోక్‌కు కేటాయించబడింది. అయితే ఈ టెండర్ గడువు ఫిబ్రవరి 28, 2026 నుంచి మార్చి 17, 2026 వరకు మాత్రమే ఉండగా, గడువు ముగిసిన అనంతరం మార్చి 18న కూడా కొందరు వ్యక్తులు భక్తుల వాహనాలను అడ్డగించి పార్కింగ్ పేరిట బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో దేవులపల్లి అశోక్‌తో పాటు పసునూరి అఖిల్, కుర్రి రమేష్, తగరపు అశోక్, ఎడ్ల రాజు, సాంబారి శరత్, కొండం కుమారి, బాగాది నితిన్, మూడు రమేష్, మట్ట రమేష్, దునికి ప్రవీణ్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన సి.ఐ డి. విశ్వేశ్వర్ మాట్లాడుతూ, విచారణ పూర్తయ్యిన అనంతరం నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

