“బూతులు కాదు.. ఆధారాలు తీసుకురండి”
పోచంపల్లికి కాంగ్రెస్ బహిరంగ సవాల్
నడికూడలో దిష్టిబొమ్మ దగ్ధం
నడికూడ, జూన్ 23 అక్షర సవాల్: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నడికూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్నెం మల్లారెడ్డి ఆధ్వర్యంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పర్నెం మల్లారెడ్డి మాట్లాడుతూ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆరోపించారు. రాజకీయ విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. టెక్స్టైల్ పార్క్ టెండర్లు, కమిషన్ల అంశాలపై ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో టెక్స్టైల్ పార్క్ భూసేకరణ, రైతులకు పరిహారం, భూముల కేటాయింపులు, అవకతవకలపై సమాధానం చెప్పాల్సింది ప్రతిపక్ష నాయకులేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. టెక్స్టైల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు, గృహాల నిర్మాణం, విద్యా, వైద్య సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధిని ఓర్చుకోలేక కొందరు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు, టెక్స్టైల్ పార్క్ అంశంపై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. “దమ్ముంటే ఆధారాలు తీసుకురండి.. ప్రజల ముందే నిజానిజాలు తేల్చుకుందాం”అంటూ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుర్ర దేవేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల చిన్ని, ధర్మారం సర్పంచ్ భాషిక ఎల్లస్వామి, నార్లపూర్ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్ యాదవ్, రామకృష్ణపురం సర్పంచ్ పెండ్లి లక్ష్మి-రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బిళ్లకంటి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

