అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక చేయూత
గీసుకొండ,అక్షర సవాల్: స్నేహం అంటే కేవలం మాటల్లో కాదు, అవసర సమయంలో చేయూతనిచ్చే మనసులోనూ ఉంటుందని గీసుకొండలో మరోసారి రుజువైంది. గీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గీసుకొండకు చెందిన ఎస్సెస్సీ 1991-92 బ్యాచ్ విద్యార్థులు తమ బాల్యస్నేహితుడికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. అదే బ్యాచ్‌కు చెందిన షేక్ అంకూస్ పాషా ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న ఆయన పరిస్థితిని తెలుసుకున్న బాల్య స్నేహితులు వెంటనే స్పందించి రూ.25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా “స్నేహం అనేది కష్టసమయంలో తోడుగా నిలబడటంలోనే నిజమైన అర్థం ఉంటుంది” అని స్నేహితులు పేర్కొన్నారు. తమ సహాయం ఆయన త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దోపతి అరుణ, తొగిటి ఉమారాణి, ఆదూరి విజయ సుశీల, గుండా నరేష్, చాడ సంజీవరెడ్డి, వీరగొని శ్యామ్, కామని రమేష్, కోల వేణు, జన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాకనాటి సారంగపాణి, ఎనబోతుల సదానందం, కర్ణకంటి రాంమూర్తి-రజిత దంపతులు పాల్గొన్నారు.


