కలం ఆగితే ప్రజాస్వామ్యం మూగబోతుంది
రాష్ట్ర అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమకొండలో జర్నలిస్టుల హక్కుల గర్జన
ఇళ్ల స్థలాలు, భద్రత, సంక్షేమంపై ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక
హన్మకొండ, మే 17 అక్షర సవాల్: రాష్ట్ర అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమకొండ పట్టణంలోని ఆదర్శ లా కాలేజీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవ సభ జర్నలిస్టుల హక్కుల పోరాటానికి వేదికగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు తమ సమస్యలను ఏకగ్రీవంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సభలో ప్రతి నాయకుడి ప్రసంగం జర్నలిస్టుల ఆవేదనను ప్రతిబింబించగా, ప్రభుత్వానికి గట్టి సందేశంగా నిలిచింది. జాతీయ అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ, “ప్రజల కోసం రాత్రింబవళ్లు శ్రమించే జర్నలిస్టు జీవితం నేడు అస్థిరంగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్, ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాలు, పెన్షన్, బీమా వంటి హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే జర్నలిస్టుకు కనీస భరోసా కూడా లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. “ఒక వార్త కోసం ప్రాణాలు పణంగా పెట్టే విలేకరి కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జర్నలిస్టుకు రక్షణ లేకపోతే ప్రజల గొంతుకకు రక్షణ ఎక్కడ ఉంటుంది?” అని ప్రశ్నించారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి రాజు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని గుర్తు చేశారు. ఫీల్డ్‌లో పని చేసే విలేకరులకు ప్రత్యేక భద్రత, సంక్షేమ నిధుల బలోపేతం అత్యవసరమన్నారు.
జర్నలిస్టు కోసం సుప్రీంకోర్టు వరకైనా పోరాడుతా: జర్నలిస్టు సంక్షేమ సంఘం లీగల్ అడ్వైజర్ రాచకొండ ప్రవీణ్ కుమార్ చేసిన ప్రసంగం సభలో భావోద్వేగ క్షణంగా నిలిచింది. “అక్రిడిటేషన్ కార్డు ఉన్నవారే జర్నలిస్టులు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్–19 ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇచ్చింది. నిజం కోసం నిలబడే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే” అంటూ చేసిన వ్యాఖ్యలకు సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. “జర్నలిస్టులపై ఎలాంటి అన్యాయం జరిగినా… హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా ఉచితంగా వాదిస్తాను. మీ పోరాటంలో నేను ముందుంటాను” అని ప్రకటించడంతో పలువురు జర్నలిస్టులు భావోద్వేగానికి గురయ్యారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించడానికి భయపడొద్దని, ప్రజల తరఫున నిలబడినప్పుడే జర్నలిస్టుపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతు భీమా సమస్యలో ఉచితంగా వాదించి బాధిత కుటుంబాలకు న్యాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, “సమాజం కోసం పోరాడే కలానికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను” అని స్పష్టం చేశారు. మహిళా కార్యదర్శి మాట్లాడుతూ, “నేను నాలుగు డిగ్రీలు పూర్తి చేసి గోల్డ్ మెడలిస్ట్ అయినా, జర్నలిజంపై ఉన్న అభిరుచితోనే ఈ రంగంలోకి వచ్చాను. గత నాలుగేళ్లుగా డిజిటల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నాను” అని తెలిపారు. మహిళలు కూడా జర్నలిజంలో ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈరోజు డిజిటల్ మీడియా ప్రభావం వేగంగా పెరుగుతోంది. కానీ జర్నలిస్టులు ఒక యూనిట్‌గా లేకపోతే సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు” అని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఆదిల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు కేవలం వృత్తి సమస్యలు కాదని, అవి ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన అంశాలని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు గట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రతి రోజు సమాజం కోసం పోరాడేది జర్నలిస్టే. కానీ ఆ జర్నలిస్టు కష్టాలను అడిగేవారు చాలా తక్కువ. గ్రామీణ విలేకరుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జీతాలు లేవు, భద్రత లేదు. అయినా ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “జర్నలిస్టు కలాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యమే బలహీనపడుతుంది. జర్నలిస్టులందరూ ఐక్యంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడాలి” అని పిలుపునిచ్చారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్వహించిన సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని ప్రస్తావించినట్లు నేతలు తెలిపారు. “పది రోజుల్లో కమిటీ ఏర్పాటు చేసి వరంగల్ లేదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు” అని వెల్లడించారు.
సభ మొత్తం ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సందేశాన్ని చేరవేసింది
“జర్నలిస్టు కేవలం వార్తలు రాసే వ్యక్తి కాదు… ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసే ధైర్య స్వరం.”
చివరగా సభలో పాల్గొన్న ప్రతి జర్నలిస్టు కళ్లలో ఒకే సంకల్పం కనిపించింది
“మా కలం ఆగదు… మా పోరాటం తగ్గదు!”

