మొక్కజొన్న సొప్పకు మంట పెట్టొద్దు
ఎస్సై.మహేందర్ హెచ్చరిక
నెక్కొండ,మే 23 అక్షర సవాల్ : పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల సార శక్తి దెబ్బతినడంతో పాటు గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నెక్కొండ ఎస్సై ఎం.మహేందర్ హెచ్చరించారు. వరి కొయ్యలు,మొక్కజొన్న సొప్ప వంటి వ్యవసాయ అవశేషాలకు మంట పెట్టవద్దని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి,భూమి ఉరుకుతనం తగ్గిపోతుందని,గాలి కాలుష్యం పెరిగి జీవరాశుల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. ఈ చర్యలు చట్టవిరుద్ధమని,కాల్చినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు పంట అవశేషాలను యంత్రాల సహాయంతో దమ్ము చేసి ఎరువుగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే కంపోస్ట్ తయారీ,బయోగ్యాస్ ఉత్పత్తి,మల్చింగ్ విధానాలు,పుట్టగొడుగుల సాగులో వినియోగించడం వంటి పద్ధతులను అవలంబించడం ద్వారా లాభాలు పొందవచ్చని వివరించారు. గ్రామాల్లో టమ్‌టమ్ ద్వారా విస్తృత అవగాహనణ కార్యక్రమాలు నిర్వహించి ప్రతి రైతుకు సమాచారం చేరేలా చేయాలని కోరారు.“మన గ్రామం – మన బాధ్యత,మన భవిష్యత్తు – మన చేతుల్లోనే” అంటూ పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అవగాహన కోసం నెక్కొండ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై ఎం.మహేందర్ సూచించారు .


