పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
28 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
గురువులకు ఘన సన్మానం
చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ
సందడిగా గడిపిన పూర్వ విద్యార్థులు
హన్మకొండ , జూన్ 28 అక్షర సవాల్ :దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం శాయంపేట జాగీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997-1998 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు. పూర్వ గురువులు మామిడాల రాజేంద్రం , బండ రవీందర్ , నరేంద్ర స్వామి, కిరణ్ కుమార్,జవహర్, రఘు చందర్ రావు ,ఉప్పలయ్య లను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు.
గురువుల ఆనందం: ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందం వ్యక్తం చేశారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.విద్యార్థినీ, విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను, తరగతి గది ముచ్చట్లను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. 28 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు పాత రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జూపాక సారంగం, వేల్పుల రాజకుమార్, మామిండ్ల సురేష్, ఒజ్జల దేవేందర్, వాసం శ్రీధర్, మల్లికార్జున్, ఆర్. స్వరూప, ఎస్. వేద కుమారి, వి. భాగ్యలక్ష్మి, వి. కిరణ్ కుమార్, వి. రవి, కె. సుధాకర్, వి. శ్రీధర్, వి. మల్లికార్జున్, కె. సంధ్య రాణి, సిహెచ్. రజిత, జి. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

