- భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహ రెడ్డి, కొయ్యూరు ఎస్సై వి. నరేష్ కు దక్కిన స్పెషల్ అవార్డు
- ఇరువురు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్
- రేపు గోల్కొండ కోటలో అవార్డు అందుకొనున్న పోలీసు అధికారులు
భూపాలపల్లి, ఆగష్టు 14 (అక్షర సవాల్) :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు కుంటలు, చెరువులు వాగులు పొంగి పొర్లగా ఆకస్మికంగా సంభవించిన వరదల్లో అనేక గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోగా అసాధారణమైన ధైర్య సాహసాలతో, విధుల పట్ల అంకిత భావంతో వరదల్లో చిక్కుకున్న అనేక మందిని జిల్లా పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు, బాధితుల ప్రాణాలను, వివిధ శాఖల సమన్వయంతో కాపాడారు.
భూపాలపల్లి జిల్లాలో కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ నగర్ లో మానెరు నదిలో చిక్కుకున్న ఇద్దరిని కొయ్యూరు ఎస్సై వి. నరేష్ తన సిబ్బందితో కలిసి కాపాడారు. వరద ఉధృతితో మోరంచకు చెందిన గొర్రె ఒదిరెడ్డి కొట్టుకుపోయి చనిపోగా, మృతదేహం కుళ్ళిపోయు ఉండటంతో ఒదిరెడ్డి శవాన్ని కర్రల సాయంతో మోసిన, భూపాలపల్లి సిఐ రామ్ నర్సింహ రెడ్డిలకు ఈ స్పెషల్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా పోలీసుల కృషికి, సేవలకు ప్రభుత్వ గుర్తింపు లభించడం సంతోషకరమని, వరదల సమయంలో హోంగార్డు నుండి సీనియర్ పోలీసు అధికారుల వరకు ఉత్తమంగా విధులు నిర్వర్తించారని ఎస్పి వెల్లడించారు.
స్పెషల్ అవార్డు పొందిన పోలీసు అధికారులు, రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్పెషల్ అవార్డు అందుకొనున్నారు.