ప్రేమ పెళ్ళి చేసారని ఇండ్లకు నిప్పు పెట్టిన సంఘటనలో సర్పంచ్ సహా 11 మంది అరెస్టు
నర్సంపేట,జూలై 6(అక్షర సవాల్) :
ప్రేమ వివాహం చేసారని యువతి తరుపు బంధువులు యువకుడితో పాటు అతని స్నేహితుల ఇళ్ళకు నిప్పు పెట్టిన సంఘటనలో సర్పంచ్ సహా 11 మంది నిందితులను నర్సంపేట పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి ఐదు ద్విచక్రవాహనాలు, పది సెల్ఫోన్లు రెండు గొడ్డళ్ళు, మూడు వేటకోడవళ్ళు, కర్రలు, డీజిల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, ఇటుకాల పల్లి గ్రామానికి చెందిన సర్పంచి మండల రవీందర్, మండల రాజమౌళి, మండల శ్రీను, మండల రమేష్, మండల పైడి, మండల సదయ్య, మండలరాజు, మండల శివ, గడ్డల విష్ణు, మండల రాజు, మండల సదయ్య వున్నారు.
ఈ అరెస్టు సంబంధించి ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్ వివరాలను వెల్లడిస్తూ వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, ఇటికాల పల్లి సర్పంచి మండల రవీందర్ కుమార్తె కావ్య హనుమకొండలో బీటెక్ చదువుతోంది. రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన జాలిగం రంజిత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరూ ఇద్దరు గతనెల 30న దేవాలయములో వివాహం చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని యువతి తండ్రి గ్రామ సర్పంచి అయిన మండల రవీందర్తో పాటు అతని తరుపు బంధువులు గత మంగళవారం అర్ధరాత్రి సూమారు 2 గంటల సమయంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు రంజిత్ ఇంటితో పాటు ప్రేమ పెళ్ళికి సహకరించారని యువకుడి మిత్రుల ఇండ్లపై దాడులకు పాల్పడి నిప్పు పెట్టారు. సంఘటనతో లక్షల్లో ఆస్తి జరిగిందని. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న నర్సంపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్నటి రోజు సాయంత్రం నేరానికి పాల్పడిన నిందితులు నర్సంపేట శివారు ప్రాంతంలోని ఖానాపూర్ వెళ్ళేమార్గంలో వున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా పాల్పడిన నేరాన్ని అంగీకరించారు.నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన నర్సంపేట ఏసిపి సంవతరావు, ఇన్స్పెక్టర్ రమేష్ ఇతర పోలీస్ సిబ్బందిని డిసిపి అభినందించారు.