పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
భూపాలపల్లి, జూలై 14(అక్షర సవాల్):
పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. రేగొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలను, పీఎస్ లోని పలు రికార్డులు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాకప్ రూమ్ ను పరిశీలించారు. 5 ఎస్ అమలుతీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, పోలీస్ స్టేషన్లో ఏ విధమయిన విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, బాధితుల ఫిర్యాదుల పట్ల ఏలాంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలని అన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు పూర్తి భరోసా ధైర్యాన్నిచ్చేలా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రతి ఫిర్యాదు పై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని, సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక దృష్టి సాధించాలని, ప్రజలను తరచూ ఇబ్బంది పెట్టే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, చిట్యాల సిఐ వేణు చందర్, ఎస్సై ఎన్. శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.