ప్రజలకు న్యాయం చేకూరేలా పనిచేయండి : భూపాలపల్లి జిల్లా ఎస్పీ
భూపాలపల్లి, ఆగష్టు 3 (అక్షర సవాల్):
ప్రజలకు న్యాయం జరిగేలా పోలీసుల పనివిధానం ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐ, ఎస్సై లతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు అండగా నిలవాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలాగే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు.అలాగే పోలీసు అధికారులు విధుల పట్ల నిబద్ధతతో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, నేరస్తులకు శిక్ష పడే విధంగా సమర్థవంతంగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ రామోజు రమేష్, భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పి నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సిఐలు ,ఎస్సైలు పాల్గొన్నారు.