పాత నేరస్తులపై నిఘా పెట్టాలి… భూపాలపల్లి ఎస్పీ
భూపాలపల్లి,జూలై 22 (అక్షర సవాల్):
భూపాలపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పాత నేరస్తులపై నిఘా పెట్టాలని, దొంగతనాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి పోలీసు స్టేషన్ ను ఎస్పీ సురేందర్ రెడ్డి తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించి, వివిధ విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. బాధితులు చెప్పే సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరించాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా కేసును పరిష్కరించడానికి ప్రయత్నించాలని సూచించారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. మహిళల రక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలని, చట్టపరిధిలో సత్వర న్యాయం జరిగేలా పోలీసులు పని చేయాలన్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో వివిధ రకాల కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించిన ఎస్పి వాటిని త్వరగా సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని డిస్పోజల్ చేయాలని అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు, సీఐ రామ్ నర్సింహా రెడ్డి, ఎస్ఐలు స్వప్న కుమారి, డేగ రమేష్ పాల్గొన్నారు.